Chandrababu – Legal Battle : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా.. చంద్రబాబును అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తప్పుడు కేసును బనాయించి చంద్రబాబును అరెస్ట్ చేశారని వివరించారు. ఈ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో 2 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో ఏ1గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఇంకో పిటిషన్ దాఖలైంది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం మరొక పిటిషన్ వేశారు. అంటే మొత్తంగా 3 పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే ఛాన్స్ ఉంది.
Also read : iPhone 15 Launched : అదిరిపోయే ఫీచర్స్ తో ‘ఐఫోన్ 15’ ఫోన్లు వచ్చేశాయ్
మరోవైపు చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. బుధవారం రోజు ఈ పిటిషన్ విచారణకు రానుంది. దీనిపై ఇవాళ చంద్రబాబు తరఫు లాయర్లు కౌంటర్ పిటిషన్ వేయనున్నారు. ఇక చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ కార్యకర్త మహేష్‌రెడ్డి, కిలారు నితిన్, గింజుపల్లి సుబ్బారావు వేర్వేరుగా ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబు (Chandrababu – Legal Battle) ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.