Chandrababu – Remand Report : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో అరెస్టయిన చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఉన్నారు. ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఇందులో చంద్రబాబు తనయుడు లోకేష్ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. కిలారి రాజేశ్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు కూడా డబ్బులు అందాయని పేర్కొంది. రిమాండ్ రిపోర్టులోని మరిన్ని వివరాలను ఒకసారి చూద్దాం..
రిమాండ్ రిపోర్టు- కీలక అంశాలు..
- రిమాండ్ రిపోర్టులో మొత్తం 28 పేజీలు ఉన్నాయి.
- 2021లో ఈ కేసుకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు. అయితే తాజాగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చి, సవరించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు ఏసీబీ అందజేసింది.
- స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయించిన రూ.371 కోట్లలో రూ.279 కోట్లను దుర్వినియోగం చేశారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు.
- చంద్రబాబుపై నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అభియోగాలను నమోదు చేశారు.
- చంద్రబాబు నాయుడు డిజైన్ టెక్ సంస్థ, సీమెన్స్ సంస్థ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగం చేసి.. ఆ నిధులు తిరిగి తనకే వచ్చేలా చంద్రబాబు చేసుకున్నారని ఆరోపించారు.
- చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అచ్చం నాయుడు కలిసి క్షేత్ర స్థాయిలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుపై స్టడీ చేయకుండా.. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తీసుకొని, హడావుడిగా ఎంఓయూ కుదుర్చుకున్నారని ప్రస్తావించారు.
- రిమాండ్ రిపోర్టులోని మూడు పేజీల్లో అచ్చం నాయుడు పేరును ప్రస్తావించారు.
- అచ్చం నాయుడు మంత్రిత్వ శాఖకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు సంబంధమే లేకున్నా రిమాండ్ రిపోర్టులో ఆయన పేరును ప్రస్తావించారు.
- నామినేషన్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును చంద్రబాబు కేటాయించారని.. ఎటువంటి ఆమోదం లేకున్నా రూ.371 కోట్లను రిలీజ్ చేశారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.
- 141 మంది సాక్షులను విచారించిన తర్వాత.. వారు ఇచ్చిన సాక్ష్యాలు, డాక్యుమెంట్ల ఆధారంగా ఈ కేసులో చంద్రబాబు పాత్ర ప్రధానంగా ఉందనే అభిప్రాయానికి వచ్చామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
- సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ లతో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. ఈ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకొని .. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతాన్ని ట్రాన్స్ ఫర్ చేశారని ఆరోపించారు.
- సీమెన్స్ , డిజైన్ టెక్ సంస్థల పనితీరుపై ఒక అంచనాకు రాకుండానే.. ఆ రెండు సంస్థలకు నిధులను చంద్రబాబు బదిలీ చేశారని ఆరోపించారు.
- సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సుమన్ బోస్‌తో కలిసి.. 2015 జూన్ 3న కుట్రపూరిత జీవో జారీ చేసి రూ.3,281 కోట్ల స్కాంకి చంద్రబాబు తెరతీశారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
- APSSDC సంస్థ పేరుతో ప్రభుత్వం రూ.371 కోట్ల నిధులను రిలీజ్ చేసిందనీ.. ఇందులో రూ.279 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనీ, ఈ నిధులు షెల్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
- నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారన్న సీఐడీ.. ఇదంతా చంద్రబాబుకి తెలిసే జరిగిందని రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
- డిజైన్ టెక్ సంస్థ.. కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.