ఏపీకి కొత్త గవర్నర్ పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్.అబ్దుల్ నజీర్ (Abdul Nazir) నియామకం అయ్యారు. ఈయన సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుత ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్రకు రమేశ్ బైస్, సిక్కింకు లక్ష్మణ్ ప్రసాద్‌లను గవర్నర్లుగా కేంద్రం నియమించింది. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లను మారుస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్యను నియమించారు. సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను నియమించారు.
మహారాష్ట్ర సహా దేశంలోని 13 రాష్ట్రాల్లో గవర్నర్లు మారారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోష్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. దీంతో పాటు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాను కూడా ఆమోదించారు. BD మిశ్రా లడఖ్ కొత్త LG అయ్యారు. అదే సమయంలో గులాబ్ చంద్ కటారియాను అస్సాం గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు మాజీ కేంద్ర మంత్రి శివ ప్రతాప్ శుక్లా, బీహార్‌కు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌లను నియమించారు.
Also Read: 12 Cheetahs: ఈనెల 18న భారత్‌కు మరో 12 చిరుతలు
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జస్టిస్ అబ్దుల్ ఎస్ నజీర్ గత నెలలో పదవీ విరమణ చేశారు. నోట్ల రద్దు, అయోధ్య కేసుపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను భారత రాష్ట్రపతి నియమించినట్లు వార్తా సంస్థలు నివేదించాయి. జస్టిస్ నజీర్ జనవరి 4, 2023న పదవీ విరమణ చేశారు.
1983లో కర్నాటక హైకోర్టులో అడ్వకేట్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత 2003లో అక్కడే అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. జస్టిస్ నజీర్ ఫిబ్రవరి 2017లో కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టులో అతను కేఎస్ పుట్టస్వామి కేసు, ట్రిపుల్ తలాక్ కేసు, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం వంటి ప్రముఖ తీర్పులలో భాగం అయ్యారు. అలాగే వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుమతిస్తూ తీర్పు, నోట్ల రద్దు కేసు, ఆర్టికల్ 19(2)లో లేని అదనపు పరిమితులను మంత్రులు, శాసనసభ్యుల వాక్ స్వాతంత్య్ర హక్కుపై విధించలేమని రాజ్యాంగ ధర్మాసనానికి కూడా ఆయన నాయకత్వం వహించారు.